WHAT IS A MEMO – CHARGE MEMO – SHOW CAUSE


WHAT IS A MEMO – CHARGE MEMO – SHOW CAUSE: MEMO/CHARGE MEMO గురించి పూర్తి సమాచారం.

WHAT IS A MEMO - CHARGE MEMO - SHOW CAUSE
WHAT IS A MEMO – CHARGE MEMO – SHOW CAUSE
  • మెమో అనేది సాధారణమైన కమ్యూనికేషన్ విధానం. అధికారులు తన క్రింది స్థాయి కార్యాలయాల తో, అధికారులతో, ఉద్యోగులతో  సంప్రదింపులు జరపడానికి మెమో ఫార్మాట్ ని ఉపయోగిస్తారు. సమాచారాన్ని, నివేదికలు, అభిప్రాయాలు, సంజాయిషీలు ఇలా క్రింది స్థాయి సిబ్బంది తో లేదా కార్యాలయాలతో దేని కోసం అయినా మెమో ఫార్మాట్ ని వాడతారు. 
  • సాధారణంగా మెమో ఇచ్చారు అనేది ఏదైనా తప్పు చేస్తే ఇస్తారు అనే అభిప్రాయం చాలా మందికి ఉంది. ఇది పూర్తిగా వాస్తవం కాదు. ఏదైనా తప్పు జరిగిన సందర్భంలో మెమో లు జారీ చేయడం సహజమే. దానర్ధం తప్పు చేసినట్లు ఆరోపించడం కాదు. ఏదైనా తప్పు జరిగినపుడు డానికి సంబంధించిన ఆధారాలు, సమాచారం, అభిప్రాయం లేదా సంజాయిషీ తెలుసుకోవడానికి సంబంధిత ఉద్యోగులకి మెమో లు ఇవ్వడం జరుగుతుంది.  ఇలా మెమో ల రూపం తో పాటు వివిధ మార్గాల ద్వారా సేకరించిన సమాచారాన్ని, ఆధారాలను, సాక్షులని బట్టి జరిగిన తప్పులకి బాధ్యులు ఎవరు? ఎవరు నిబంధనలను అతిక్రమించారు అని నిర్ధారణ కు వస్తారు. దీనిని ప్రాధమిక విచారణ అంటారు. దీనికి ప్రత్యేక విధి విధానాలు ఏమీ ఉండవు. జరిగిన తప్పుకు ఆధారాలను, బాధ్యులను గుర్తించడం ప్రధాన లక్ష్యం. (ఇది పోలీస్ శాఖ కేసు దర్యాప్తు తరహా గా భావించవచ్చు) 
  • ప్రాధమిక విచారణ జరగడానికి లేదా ఆధారాలు సేకరించడానికి ఏదైనా ఇబ్బంది కలుగుతుందని భావించిన సందర్భాలలో ఆధారాలను తారుమారు చేయడానికి అవకాశం లేకుండా అవసరమైన వారిని సస్పెండ్ చేస్తారు (క్రిమినల్ కేసులలో అరెస్ట్ చేయడం గా భావించవచ్చు) 
  • ప్రాధమిక విచారణ లో తేలిన అంశాల ఆధారంగా  బాధ్యులైన వారిపై అభియోగాలు నమోదు చేస్తూ  ఆ అభియోగాలకు ఆధారాలను, సాక్ష్యాలను జతపరుస్తూ ఛార్జ్ మెమో  జారీ చేయటం జరుగుతుంది. (క్రిమినల్ కేసులలో ఇదే విధంగా కోర్టు లో ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తారు). 
  • ఆ ఛార్జ్ మెమో కి సంజాయిషీ ఇవ్వవలసిందిగా సదరు ఉద్యోగిని కోరతారు.  అతని సంజాయిషీ ని బట్టి అభియోగాలు డ్రాప్ చేయడం లేదా కొనసాగిస్తూ తదుపరి చర్యలు ప్రారంభించడం జరుగుతుంది (పోలీసులు ఫైల్ చేసిన ఛార్జ్ షీట్ ని వాటిని ఎందుకు అడ్మిట్ చేసుకోరాదో తెలిపమని కోర్టు నిందితులకు పంపుతుంది. వారు ఇచ్చిన సమాధానం ఆధారంగా ఆ ఛార్జ్ షీట్ ని విచారణకు తీసుకోవడం లేదా తిరస్కరించడం జరుగుతుంది)
  • ఉద్యోగి ఇచ్చిన సంజాయిషీ తో సంతృప్తి చెందితే తదుపరి చర్యలు డ్రాప్ చేయడం జరుగుతుంది. అభియోగాలు తీవ్రమైనవి అయి మేజర్ పనిష్మెంట్ ఇచ్చే ఉద్దేశ్యం ఉన్నట్లయితే ఉద్యోగికి తన తప్పు లేదని నిరూపించుకోవడానికి అవకాశం కల్పిస్తూ ఎంక్వయిరీ ఆఫీసర్ (ఈయన జడ్జి తరహాలో వ్యవహరిస్తారు) ప్రెజెంటింగ్ ఆఫీసర్ (పబ్లిక్ ప్రాసిక్యూటర్ లేదా గవర్నమెంట్ ప్లీడర్ తరహాలో వ్యవహరిస్తారు). అలాగే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగి తన తరపున తాను లేదా సహాయకుడిని (డిఫెన్స్ అసిస్టెంట్) ని (ఈయన డిఫెన్స్ లాయర్ గా వ్యవహరిస్తారు).  ప్రెజెంటింగ్ ఆఫీసర్ అభియోగాలు నిరూపించడానికి ప్రయత్నిస్తే డిఫెన్స్ అసిస్టెంట్ ఆ అభియోగాలు తప్పని నిరూపించడానికి ప్రయత్నిస్తారు. వీరి వాదనలను బట్టి, ఆధారాలను  ఎంక్వయిరీ ఆఫీసర్ అభియోగాలు రుజువు అయ్యాయా లేదా అనే నివేదిక సమర్పిస్తారు. 
  • ఈ విచారణ నివేదిక ని ఆరోపణలను ఎదుర్కొంటున్న ఉద్యోగికి ఇచ్చి అతని అభిప్రాయాన్ని తీసుకుంటారు.
  • ఆరోపణలు రుజువైనట్లు నివేదిక ఇస్తే ఆ ఉద్యోగిపై ఈ పనిష్మెంట్ ఎందుకో ఇవ్వకూడదో తెలుపమని షో కాజ్ నోటీసు జారీ చేస్తారు. 
  • అతని సంజాయిషీ తీసుకుని ప్రొపోజ్ చేసిన పనిష్మెంట్ ని తగ్గించడం కానీ లేదా అదే పనిష్మెంట్ ని ఇస్తూ కానీ ఆదేశాలు జారీ చేస్తారు. 
  • ముందుగానే మైనర్ పనిష్మెంట్ ఇవ్వాలని భావించినప్పుడు ఈ విచారణ అనేది లేకుండా ఛార్జ్ మెమో ఇచ్చిన సంజాయిషీ ఆధారంగా సంతృప్తి చెందకపోతే నేరుగా షో కాజ్ జారీ చేసి పనిష్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. 
  • ఈ పనిష్మెంట్ లో ప్రభుత్వం తో సహా ఉన్నతాధికారులు ఎవరూ కూడా ఉద్యోగి అప్పీల్ చేసుకుంటే తప్ప కలగజేసుకోలేరు.  ఒకవేళ ఉద్యోగి అప్పీల్ చేసుకుంటే కనుక ఉన్నతాధికారులకు పనిష్మెంట్ తగ్గించడం,  అదే పనిష్మెంట్ ని నిర్ధారించడం తో పాటు పెంచడానికి కూడా అవకాశం ఏర్పడుతుంది. (ఆరోపణలు రుజువైన సందర్భంలో అప్పీల్ కి వెళ్లినా కూడా పనిష్మెంట్ తీవ్రత ని మార్చడం సాధ్యం కానీ పనిష్మెంట్ లేకుండా డ్రాప్ చేయడం సాధ్య పడదు).
  • ప్రొబేషన్ లో ఉన్నా, ప్రొబేషన్ పూర్తి అయినా తప్పు చేసినట్లు నిర్ధారణ చేయకుండా చర్యలు తీసుకోలేరు. కాకపొతే ప్రొబేషన్ లో ఉండగా తప్పు నిర్ధారణ అయితే చిన్న తప్పుకు కూడా ఉద్యోగం నుండి తొలగించడం సులభం. అలాగే తరచుగా ఆరోపణలు వచ్చి (నిర్ధారణ అయినా కాకపోయినా) సంజాయిషీ ఇచ్చుకునే పరిస్థితి ఉంటే ఆ కారణంగా ఉద్యోగి సర్వీస్ పట్ల సంతృప్తి చెందలేదనే నెపంతో ప్రొబేషన్ ని పొడిగించవచ్చు.      (resource from STU Murthy sir)
Author Avatar

Kotibros

Kotibros are very passionate to publish useful information. They will update educational, health, finance, technology and jobs related information in very simple language.

View all posts by Kotibros