
స్పైసీ స్నాక్స్ తినాలనిపిస్తే ఎప్పుడూ ఒకే రకమైన వంటకాలు తిని విసుగు చెందారా? అయితే ఈసారి సింధీ స్పెషల్ “ఆలూ తుక్” ట్రై చేయండి! పేరు వినడానికి కొత్తగా ఉన్నా, రుచిలో మాత్రం అదిరిపోతుంది. కరీనా కపూర్ లాంటి సెలబ్రిటీలు కూడా ఈ ఆలూ తుక్కు అభిమానులే అంటే నమ్మండి. ముఖ్యంగా వెజిటేరియన్ స్నాక్స్ తినాలనుకునేవారికి బంగాళదుంపలతో చేసే ఈ వంటకం ఒక మంచి ఎంపిక. మరి ఆలూ తుక్ ఎలా తయారు చేయాలో చూసేద్దామా!
ఆలూ తుక్: సింధీ స్పెషల్ రెసిపీ!
ఆలూ తుక్ అనేది సింధీ వంటకాల్లో చాలా ఫేమస్. బంగాళాదుంపలను డీప్ ఫ్రై చేసి, ఆ తర్వాత కొన్ని మసాలాలు జోడించి తయారుచేస్తారు. దీన్ని తయారుచేయడం చాలా సులువు. ఇంట్లో ఉన్న కొద్ది పదార్థాలతోనే ఈ రుచికరమైన స్నాక్‌ను తయారు చేసుకోవచ్చు. పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఇష్టపడే ఈ వంటకాన్ని ఒకసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది.
ఆలూ తుక్ కావలసిన పదార్థాలు:
- బంగాళాదుంపలు – 7-8 (పెద్దవి లేదా 12-15 చిన్నవి)
- ఉప్పు – 1 చెంచా
- ధనియాల పొడి – 1.5 చెంచాలు
- కారం – 1.5 చెంచాలు
- చాట్ మసాలా – 1 చెంచా
- ఆమ్ చూర్ పొడి (మామిడి పొడి) – 1/2 చెంచా
- పచ్చిమిర్చి – 2-3 (మీ ఇష్టం)
- నిమ్మకాయ – 1/2
- పసుపు – చిటికెడు
- కొత్తిమీర – కొద్దిగా
- నూనె – వేయించడానికి సరిపడా
ఆలూ తుక్ తయారీ విధానం:
- ముందుగా బంగాళదుంపలను శుభ్రంగా కడిగి, తొక్క తీసి, కొద్దిగా మందంగా గుండ్రని ముక్కలుగా కట్ చేసుకోవాలి. చిన్న బంగాళదుంపలు అయితే, ఉడికించి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు.
- స్టవ్ మీద నూనె వేడి చేసి, మీడియం ఫ్లేమ్‌లో బంగాళదుంప ముక్కలను వేయించాలి.
- దుంప ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేయించి, ప్లేట్లోకి తీసుకోవాలి.
- ఆలూ తుక్ను మరింత క్రిస్పీగా చేయాలనుకుంటే, డబుల్ ఫ్రై చేసుకోవచ్చు. అంటే, ఒకసారి వేయించిన ముక్కలను మళ్లీ నూనెలో వేసి వేయించాలి.
- వేయించిన బంగాళదుంప ముక్కలపై చాట్ మసాలా, ఆమ్ చూర్ పొడి, కారం, ఉప్పు వేసి బాగా కలపాలి.
- చివరగా, పచ్చిమిర్చి, నిమ్మరసం, కొత్తిమీర వేసి గార్నిష్ చేస్తే, కారంగా, పుల్లగా ఉండే ఆలూ తుక్ రెడీ!
అంతే! వేడి వేడి ఆలూ తుక్ను తింటూ ఎంజాయ్ చేయండి. పిల్లలు స్కూల్ నుండి రాగానే చేసి పెడితే ఎంతో సంతోషిస్తారు. సాయంత్రం టీ టైమ్ స్నాక్‌గా కూడా ఇది ఒక మంచి ఎంపిక.